మిరప కోతలు:

పంట దిగుబడి అధికంగా పొందటానికి చేట్టుపై పండిన కాయల్ని ఎప్పటికప్పుడు కోసి ,పటాలపై కాని ,సిమె౦ట్ కళ్ళాల పైన గాని ఆరబెట్టడం శ్రేష్టం.వర్షాధారపు పైరుకు 3-4 కోతలు ,నీటి ఆధారపు పైరుకు 6-8 కోతలు చేయాలి.

ఎగుమతి కొరకు మిరప నాణ్యతను పెంచటానికి సూచనలు:

 • 1.మొక్కల మీద మిరపకాయలను పండనీయరాదు.ఎక్కువగా పండితే మిరప నాణ్యత తగ్గుతుంది.తరచుగా ఎప్పటికప్పుడు పండిన కాయలు కోయటం వలన దిగుబడులు పెరుగుతాయి.
 • 2.కాయకోసే ముందు సస్య రక్షణ మందులు పిచికారి చేయరాదు. పిచికారి చేసిన ఎడల మిరప కాయల మీద అవశేషాలుండే ప్రమాదముంటుంది.
 • 3.అఫ్లాటాక్సిన్ వృద్ధి కాకుండా మిరప కాయలను పాలిథిన్ పట్టాల మీద లేదా సిమెంటు గచ్చు మీద ఎండబెట్టాలి.
 • 4.రాత్రిళ్ళు మంచు బారిన పడకుండా కాయలను కప్పి ఉంచాలి.
 • 5.మిరపలో 10 శాతానికి మించి ఎక్కువ తేమ ఉండకుండా ఎండబెట్టాలి.
 • 6.ఎండ బెట్టేటప్పుడు దుమ్ము,ధూళి,చెత్త,చెదరం చేరకుండా కాయలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.
 • 7.కాయలు ఎండబెట్టే దరిదాపుల్లో కుక్కలు ,పిల్లులు ,కోళ్ళు,ఎలుకలు మరియు పందికొక్కులు రానీయకుండా చూసుకోవాలి.
 • 8.తాలు కాయలను,మచ్చ కాయలను గ్రేడింగ్ చేసి వేరుచేయాలి.
 • 9.నిల్వ చేయడానికి తేమ లేనటువంటి శుభ్రమైన గోనె సంచుల్లో కాయలు నింపాలి.
 • 10.తేమ తగలకుండా వరిపొట్టు లేదా చెక్క బల్లల మీద గోడలకు 50-60 సెం.మీ దూరంలో నిల్వ ఉంచాలి.
 • 11.అవకాశమున్న చోట శీతల గిడ్డి౦గుల్లో నిల్వచేస్తే రంగు,నాణ్యత తగ్గిపోకుండా లాభదాయకంగా ఉంటుంది.
 • 12.కాయలు నిగనిగలాడుతూ మంచి రంగు రావాలని వ్యర్ధమైన రసాయనాలను,రంగులను వాడకూడదు.అవి ప్రమాదకరమే కాక నిషేది౦పబడ్డాయి.
 • 13.అకాల వర్షాలకు గురికాకుండా,మంచు బారిన పడకుండా,రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో గాని లేదా టొబాకో బారన్ లలో గాని ఎండబెట్టి నాణ్యమైన మిరప కాయలను పొందవచ్చు.

మిరపను ఎదపెట్టడం:

మిరపను నేరుగా ఎదబెట్టే పద్ధతిలో,రైతులో తొలకరి వర్షాలు పడిన వెంటనే,భూమిని ట్రాక్టరుతో 3-4సార్లు దున్ని,మెత్తటి దుక్కి ,పదును వచ్చేలా చేసుకోవాలి.ట్రాక్టరు తో దుక్కి చేసిన భూమిని ఎద్దులతో చదును చేసుకోవాలి,పొలమంతా చదునుగా,శుభ్రముగా ఉంచుకోవాలి,అప్పుడే పొలంలో మిరప విత్తనాలు నేరుగా ఎదబెట్టదానికి వీలుగా ఉంటుంది.సకాలంలో వర్షాలు పడితే ఎదపెట్టడం వల్ల పంట మొక్కలు లోతైన వేళ్ళతో ఏపుగా పెరిగే అవకాశం ఉంది.పంట త్వరగా కాపుకొస్తుంది.చీడపీడలను సమర్ధవంత౦గా తట్టుకుంటుంది.