పురుగులు

పేనుబంక

ఈ పెనుబ౦క ప్రత్తిని ముఖ్యంగా తొలి దశలో ప్రత్తి పండించే అన్ని ప్రాంతాలలో ఆశిస్తాయి.ఈ పేలు సాధారణంగా జూలై,ఆగుష్టు నెలల్లో వర్షానికి మధ్య వచ్చే బెట్టకాలంలో పైరుపై అనువుగా పెరుగుతాయి.వర్షాలోచ్చినప్పుడు ఈ పేల సాంద్రత తగ్గిపోతుంది. పిల్ల,పెద్ద పేలు ఆకుల అడుగుభాగంలో,కొమ్మల పైనుండి రసం పీల్చుతూ జీవిస్తాయి. అందుచేత మొక్క ఎదుగుదల నశిస్తుంది.ఇవి విసర్జించే తేనె వంటి పదార్థము వలన ఆకులు,కా౦డముపై మసి తెగులు(సూటిమోల్టు) వ్యాపిస్తుంది.

నివారణ

విత్తనశుద్ది(ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా.1కిలో విత్తనానికి)మరియు కాండము మీద 20,40,60 రోజుల పైరుపై మోనోక్రోటోఫాస్:నీరు(1:4)లేక ఇమిడాక్లోప్రిడ్:నీరు(1:20) కలిపి కుంచతో పూసి ఈ పురుగును అదుపులో పెట్టవచ్చును.ప్రత్తి లో 15-20 పేనుబంక ఆశించిన మొక్కలు కనిపిస్తే నివారణ చర్యలు చేపట్టాలి.


పచ్చదొమ/దీపపు పురుగు

పచ్చదోమ అన్ని ప్రాంతాలలోన ముఖ్యంగా పైరు మొదట దశలో ఎక్కువగా ఆశిస్తుంది.ఎక్కువ వర్ష పాతం,తక్కువ ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఈ దోమలు బాగా వృద్ధి చెందుతాయి. పిల్ల,పెద్ద దోమలు అడ్డంగా నడుస్తూ,ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి.ఇవి ఆశించిన మొక్కల ఆకుల చివర్లు పసుపు పచ్చగా మారి,క్రమేపి ఆకు అంతా ఎర్రబడి(హపర్ బర్న్)చివరిగా ఆకులు ముడుచుకొని దోనెల లాగా కనిపిస్తాయి.దోమపోటు బాగా వున్న పొలాల్లో పైరంతా ఎర్రగా మారి ఆకులన్ని ఎండి రాలిపోతాయి.

నివారణ

ఎల్-604,ఎల్ఆర్ఎ-5166,ఎల్-603,సవిత,నరసింహ(ఎన్ ఎ-1325),ఎన్ హెచ్ హెచ్ -44,హెచ్-,ఎన్ హెచ్ హెచ్-390 మరియు లామ్ హైబ్రిడ్ ఈ పురుగును తట్టుకు౦టాయి.పేనుబంక పాటించి వీటిని నివారించవచ్చు.


తామర పురుగు/ముడుత పురుగు

తామర పురుగులు పైరు మొదటి దశ నుంచి ఏ దశలోనైనా కన్పిస్తాయి.అయితే వర్షాలు తక్కువగా ఉండి,ఉష్ణోగ్రత ఎక్కువగా వుంటే ఇవి విపరీతంగా వృద్ధి చెందుతాయి.పిల్ల పురుగులు,పెద్ద పురుగులు కూడా ఆకులను మరియు పూమొగ్గలను గీకి,రాసాన్ని పీలుస్తాయి.అందుచేత ఆకుపై భాగంలో మచ్చలు పడి ఆకులు పాలిపోయి ముడుచుకుపోతాయి.

నివారణ

రసం పీల్చే పురుగులకు ఆవలంభించే నివారణ పద్దతులే ఈ పురుగును అదుపులో పెడతాయి.


తెల్ల దోమ

తెల్ల దోమ పురుగు ఎక్కువగా నవంబర్ నుంచి జనవరి-ఫిబ్రవరి మాసాల వరకు ప్రత్తిని ఆశిస్తూ ఉంటుంది.గ్రుడ్ల నుండి వెలువడిన పిల్లలు,ఈ నెల దగ్గరగా స్థిరపడి రసాన్ని పీలుస్తాయి.పిల్ల పురుగులు ఆకుల అడుగుబాగాన నిశ్చలంగా నిలిచిపోయి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు రంగుకి మారి ఎండిపోయి,మొక్కలు గిడసబారి పోతాయి.ఈ పురుగులు విసర్జించే తేనెవంటి పదార్ధం వలన నల్లని బూజుతెగులు వ్యాపిస్తుంది.ఈ దోమ ఆశించిన పైరులో ఆకులు,మొగ్గలు,పిందెలు రాలిపోవటమే కాకుండా,కాయలు పూర్తిగా ఎదగకముందే పగిలిపోతాయి మరియు పింజ నాణ్యత క్షీణిస్తుంది.గింజలలో నూనె శాతం కూడా తగ్గిపోతుంది.

నివారణ

ఆకుకు 5-10 తెల్ల దోమలు గమనించిన ట్రైజోఫాస్ 2.5మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.వేప సంభందిత మందులు ఈ పురుగును అదుపు చేస్తాయి.కాయతొలిచే పురుగులను నివారించడానికి వాడే సింథటిక్ పైరిత్రాయిడ్స్ వలన ఈ పురుగు ఉధృతం చాలా ఎక్కువవుతుంది.తెల్ల దోమ అదుపుకు విధిగా అధిక మోతాదు నీటితో,నాప్ సాక్ స్ప్రేయార్ ద్వారా పిచికారి చేయాలి.


ఎర్ర నల్లి

ఎర్ర నల్లి ముఖ్యంగా పంట చివర దశలో ఆశిస్తుంది.ఇవి ఎర్ర రంగులో,కంటికి కనపడనంత పరిమాణంలో ఉంటాయి.చిన్న,పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన ఉండి రసాన్ని పీలుస్తాయి.ఈ ఆకులు పసుపు రంగుకు మారి ఎర్ర బడతాయి.ఆకుల పై నుంచి పొడలు పొడలుగా కనిపించే దానిని బట్టి ఎర్రనల్లి ఉనికిని కనిపెట్టవచ్చు.ముఖ్యంగా ముదురాకులపై వీటి ప్రభావాన్ని గమనించవచ్చు.ఇవి సోకిన మొక్కలలో ఎదుగుదల క్షీణిస్తుంది.

నివారణ

ఒక చదరపు సె౦.మీ లో 10 నల్లులు గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.నీటిలో కరిగే గంధకము3గ్రా.లేదా డైకోఫాల్ 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి నివారించవచ్చు.

పొగాకు లద్దె పురుగు

ఈ పురుగు సాధారణంగా అన్ని ప్రాంతాలలో ఎక్కువగానే ఆశిస్తుంది.పిల్ల గొంగళి పురుగులు ఆకులను గీకితిని జల్లెడాకులాగా తయారుచేస్తాయి.పెద్ద పురుగులు ఆకులను తినడం వలన (మొక్కలన్నీ మోడులాగా మారి)పంట పూర్తిగా నాశనమవుతుంది.పగటి పూట ఇవి మొక్కల మొదళ్ళలో భూమి లో దాగి వుంది,రాత్రిపూట ఆకులు తింటాయి.

యాజమాన్యం

లింగాకర్షక బుట్టలు(ఎకరాకు 4)ద్వారా పురుగు ఉనికిని గమనించి,వంద మీటర్లు వరుసకు 8గ్రుడ్ల సముదాయాలు కనిపించిన వేపగింజల కషాయం 5% సాయంత్రం పిచికారి చేయాలి.అవసరమైతే క్లోరిఫైరిఫాస్ లేదా ఎండోసల్ఫాన్ లేదా క్వినాల్ ఫాస్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.విషపు ఎర (10 కిలోలు తవుడుకి 1కిలో బెల్లం మరియు 1లీ.మోనోక్రోటోఫాస్ లేదా 1కిలో కార్బరిల్ మందును కలిపి)తగు నీటితో వు౦డలుగా చేసి మొక్కల మొదళ్ళ దగ్గర పెట్టి పెద్ద లార్వాలను నివారించవచ్చును.


మచ్చల పురుగు/తలనత్త పురుగు

ఈ పురుగు ప్రత్తిలో కాయ తొడగక ముందు,కాయ తొడిగే దశలో ఎక్కువగా ఆశిస్తుంది.చిన్న లార్వా,మొక్కల చివర్లను తొలిచి తింటాయి.అందువల్ల కొమ్మల చివర్లు వడలిపోతాయి.దీనినే తలనత్త అంటారు.పెద్ద లార్వా మొగ్గ,పిందె,కాయలను తొలిచి,పైరుకి పూర్తిగా నష్టం కలిగిస్తాయి.

నివారణ

సమగ్ర యాజమాన్యము పాటించి ఈ పురుగును అరికట్టవచ్చు.ఎండోసల్ఫాన్ మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి ఈ పురుగును అరికట్టవచ్చును.


శనగపచ్చ పురుగు

ఈ పురుగు లార్వా,మొగ్గలు,పూవులు,కాయలు,ఆకులను తింటుంది.ముఖ్యంగా ఇవి కాయల లోపలికి తలనువుంచి,మిగతా శరీరాన్ని బయటైవుంచి కాయలను తింటాయి.

యాజమాన్యం

ట్రైకోగ్రమ్మా అను గ్రుడ్ల పరాన్న జీవులు హెక్టారుకి ఒక లక్ష చొప్పున విత్తిన 40-45రోజుల తర్వాత (పచ్చ పురుగు మొదట గ్రుడ్లు పెట్టే దశ)వదిలిన యెడల పురుగు ఉధృతను తగ్గిస్తుంది. ఎండోసల్ఫాన్(2మి.లీ నీటికి) మరియు ఎన్.పి.వైరస్ ద్రావణం (500యల్.ఇ/హెక్టారుకి)టీపాలు,బెల్లంతో కలిపి పిచికారి చేయాలి(విత్తిన 100-110రోజులకు).తర్వాత 5% వేపగింజల ద్రావణం(విత్తిన 125వ రోజు)మరియు క్లోరోఫైరిపాస్(2మి.లీ లీటరు నీటికి)5% నువ్వుల నూనెతో కలిపి (విత్తిన 135-140వ రోజు)పిచికారి చేసి ఈ పురుగు ఉధృతిని అదుపులో పెట్టవచ్చు.


గులాబి రంగు కాయ తొలుచు పురుగు

చిన్న పురుగులు మొగ్గలలోనికి తోలుచుకొని పోయి లోపలి పదార్ధాలను తింటాయి.తద్వారా మొగ్గలు గ్రుడ్డి పూలుగా మారుతాయి.ఇవి చిన్న కాయలను కూడా తొలిచి వాటిని నష్టపరుస్తాయి.కాయల మీద ఈ పురుగు తొలిచిన రంధ్రాలు బయటకు కనబడవు. పురుగు తాకిన కాయలు పూర్తిగా వృద్ది చెందక త్వరగా పక్వానికి వస్తాయి.లోపలి నుండి విత్తనాలను తిని నష్టపరచడం వలన దూది నాణ్యత తగ్గిపోతుంది.

యాజమాన్యం

దీని చివరి లార్వా దశ విత్తనాలలో చాలా నెలలు గడిపి,మరలా విత్తిన పైరును ఆశిస్తుంది.కావున ఆమ్లముతో శుద్ధి చేసిన విత్తనాలు వాడాలి.గ్రుడ్డిపూలు గమనించిన ఎరివేయాలి.అలాగే త్వరితంగా పక్వానికి వచ్చిన కాయలు కూడా ఏరి నాశనం చేయాలి.పురుగు ఆశించకుండా చూసుకోవడం మంచిది.